Vaibhav Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది. దీనిని రాజకీయ కుట్ర మరియు ప్రభుత్వ సంస్థల దుర్వినియోగంగా వైభవ్ గెహ్లాట్ పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ఇలాంటివి జరుగుతాయని మాకు తెలుసు.. మా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ దోటసార నివాసంపై కూడా దాడి చేశారు. నా తండ్రి అశోక్ గెహ్లాట్‌ను టార్గెట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు సమన్లు పంపారు. నేను ఇప్పటికే దీనిపై వివరణలు ఇచ్చాను అని ఆయన అన్నారు. ఈడీ అడిగినప్పుడల్లా సహకరిస్తానని, హాజరవుతానని వైభవ్ గెహ్లాట్ చెప్పారు.తన కుమారుడికి సమన్లు మరియు ఇద్దరు రాజస్థాన్ కాంగ్రెస్ నాయకులపై దాడులపై అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఈడీ ఒక జాతీయ ఏజెన్సీ. అటువంటి ఏజెన్సీల విశ్వసనీయతను కాపాడుకోవాలి. లేకపోతే గందరగోళం తలెత్తుతుంది. ఇక్కడ ప్రశ్న నా కొడుకు గురించి మాత్రమే కాదు. ప్రతిపక్షాలను చూసే పద్ధతి ఇది కాదని అన్నారు.
మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ తన చిరకాల ప్రత్యర్థి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా నిలిచారు. ఈడీ చర్యను ఖండించారు. ఇలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ నేతలను బీజేపీ భయపెట్టలేదని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ఏకతాటిపైకి వస్తున్నారని పైలట్ అన్నారు.ఈ ఏడాది ఆగస్టులో ముంబైకి చెందిన ట్రైటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై మనీలాండరింగ్ కేసులో ఫెమా కింద జైపూర్, ఉదయ్‌పూర్, ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ స్లీత్‌ల బృందం సోదాలు నిర్వహించింది.రతన్ కాంత్ శర్మ అనే వ్యక్తికి చెందిన కార్ రెంటల్ సర్వీస్‌లో వైభవ్ గెహ్లాట్ వ్యాపార భాగస్వామి గా ఉన్నారు.