Ayodhya Ram Temple: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 మరియు ఈ సంవత్సరం మార్చి 31 మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ. 3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు.
శనివారం ఉదయం మూడు గంటలపాటు ట్రస్ట్ అధికారుల సమావేశం అనంతరం, విదేశీ కరెన్సీలో విరాళాలు తీసుకునే చట్టపరమైన ప్రక్రియతో సహా 18 అంశాలపై చర్చించామని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం కింద ట్రస్ట్ అనుమతి కోసం దరఖాస్తు చేసిందని దాని కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కథా మ్యూజియం లీగల్ ట్రస్ట్‌గా ఉంటుందని, రామమందిరానికి 500 ఏళ్ల చరిత్ర, 50 ఏళ్ల చట్టపరమైన పత్రాలు భద్రపరుస్తామని చెప్పారు. జనవరి 22న జరగనున్న (ప్రాణ ప్రతిష్ఠ) కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.పవిత్రోత్సవం రోజున సూర్యాస్తమయం తర్వాత తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని ఆలయ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.జనవరి 1 నుంచి 15 వరకు ఐదు లక్షల గ్రామాల్లో పూజ అక్షింతలు పంపిణీ చేయనున్నారు.జనవరి 2025 నాటికి ఆలయాన్ని మూడు దశల్లో పూర్తి చేస్తామని రాయ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో మొదటి సోలార్ సిటీగా అయోధ్య..(Ayodhya Ram Temple)
జనవరిలో జరిగే రామ మందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు అయోధ్యను ఉత్తరప్రదేశ్‌లో మొదటి సోలార్ సిటీగా అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ (UPNEDA)ఈ పనిని చేపట్టిందని అధికారులు తెలిపారు.సరయూ నది ఒడ్డున సోలార్ పార్కును అభివృద్ధి చేయడం, సౌరశక్తితో నడిచే పడవలను అందించడం, సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణాలో సౌరశక్తి వనరులను స్వీకరించడం, బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌరశక్తితో నడిచే సౌకర్యాలను విద్యుద్దీకరణతో పాటు అందించడం ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. సౌరశక్తిని ఉపయోగించే ప్రభుత్వ భవనాలు మరియు గృహావసరాల కోసం సౌర విద్యుత్ వ్యాప్తిని మెరుగుపరచడం కూడా ఇందులో ఉన్నాయి. సరయూ ఒడ్డున 40 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎన్‌టిపిసి గ్రీన్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లో ముఖ్య అంశం. ఇది జనవరి నాటికి 10 మెగావాట్ల విద్యుత్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.సోలార్ ఎనర్జీ పాలసీ ప్రకారం, పునరుత్పాదక శక్తి ద్వారా 10 శాతం విద్యుత్ డిమాండ్‌ను తీర్చే ఏదైనా నగరం సోలార్ సిటీగా పరిగణించబడుతుంది.