Makara Jyothi: కేరళ లోని పతనంతిట్ట కొండపై ఉన్న శబరిమల ఆలయానికి సోమవారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి ‘మకర జ్యోతిని ‘ దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
10 వ్యూపాయింట్లు ఏర్పాటు..(Makara Jyothi)
శబరిమలకు 4 కిలోమీటర్ల దూరంలోని పొన్నంబలమేడుకు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక ప్రాంతాల్లో ఉన్న అయ్యప్పమాల ధరించిన భక్తులతోపాటు అనేక మంది తరలివెళ్లారు.మకరజ్యోతి దర్శనం కోసం లక్ష మంది భక్తులు తరలివస్తుండటంతో చూసేందుకు 10 వ్యూపాయింట్లను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పులిమేడు, పరుంతుంపర, పాంచాలిమేడులో కూడా దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది డీఎస్పీల ఆధ్వర్యంలో 1,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మకర జ్యోతి దక్షిణాది ప్రజలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మకరజ్యోతిని దర్శించుకుంటే అదృష్టం, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు.