Site icon Prime9

Devendra Fadnavis: మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు.. డిప్యూటీలుగా షిండే, అజిత్ పవార్

Devendra Fadnavis Takeen Oath as Maharashtra CM: మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం దక్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే వేదిక మీద శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ముచ్చటగా మూడోసారి..
దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ తండ్రి గతంలో గంగాధర్‌ ఫడ్నవీస్‌ జనసంఘ్‌, బీజేపీలో చురుగ్గా పని చేశారు. కాగా, దేవేంద్ర యుక్త వయసులోనే ఆయన కన్నుమూశారు. ఏబీవీపీ ద్వారా 1989లో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన దేవేంద్ర 22 ఏండ్లకే నాగ్‌పూర్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో 27ఏండ్లకే మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చి.. 2014లో తొలిసారి రాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్‌ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసినా, సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవటంతో 3 రోజులకే రాజీనామా చేశారు. కాగా, 2022 జూన్‌లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. షిండే కేబినెట్‌లో ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

హోం శాఖ ఎవరికో?
గురువారం నాటి ప్రమాణ స్వీకారంలో కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులే ప్రమాణం చేశారు. మూడు పార్టీలూ కలిసి మంత్రి వర్గం మీద చర్చించి త్వరలోనే ప్రకటిస్తామని మహాయుతి నేతలు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో బీజేపీకి 21, శివసేనకు 12, అజిత్ పవార్‌ వర్గానికి 9 మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖ ఖాయమైందని, హోం శాఖపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో తాము నిర్వహించిన హోం, పరశ్రమలు, పట్ణణాభివృద్ధి వంటి 9 శాఖలను తిరిగి తమకే ఇవ్వాలని షిండే కోరుతున్నట్లు సమాచారం.

హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు, యోగి ఆదిత్య నాథ్‌లతో బాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల సీఎంలతో సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే, వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌-అంజలి దంపతులు, బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

పవన్ శుభాకాంక్షలు..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం వేళ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు.. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఫడ్నవీస్‌ సమర్థ నాయకత్వలో మహారాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కాలని పవన్ ఆకాంక్షించారు. సింగపూర్‌లో చదువుకుంటున్న తన కుమారుడు విద్యాసంస్థలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున తాను ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నట్లు పవన్ తెలిపారు.

Exit mobile version