Devendra Fadnavis oath as CM today: మరాఠా రాజకీయంలో మలుపులు ముగిశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి నేతల మధ్య గత వారం రోజులుగా సాగుతున్న చర్చలు బుధవారానికి ఒక కొలిక్కి వచ్చాయి. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుండగా, షిండే, అజిత్ పవార్‌లు ఉప ముఖ్యమంత్రులుగా గురువారం ప్రమాణం చేయనున్నారు.
బీజేఎల్పీ నేతగా..
బుధవారం నాటి కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారిద్దరూ చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను సమావేశంలోని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గవర్నర్‌తో భేటీ
అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా మహాయుతి నేతలు బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసి కోరారు. ఈ సమయంలో ఫడ్నవీస్‌తో బాటు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా ఉన్నారు. అనంతరం ముగ్గురు అగ్రనేతలూ సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. సీఎం పదవి అనేది కేవలం సాంకేతిక అంశమేనని, ఇకపైన కూడా తామంతా కలిసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఫడ్నవిస్ తెలిపారు. మరోవైపు, గురువారం ముంబైలోని ఆజాద్ మైదానంలో నూతన సర్కారు కొలువుదీరనుంది. దీనికి ప్రధాని మోదీ, ఎన్డీయే కీలక నేతలు హాజరు కానున్నారు.
పేరు మార్చుకున్న ఫడ్నవీస్?
కాగా, ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం తాలూకూ ఆహ్వానపత్రం నేడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఈ పత్రంలో ఫడ్నవీస్ పేరును ‘దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్’గా ప్రస్తావించటమే ఈ చర్చకు కారణం. ఫడ్నవీస్ తల్లి పేరు సరిత కాగా, తండ్రి పేరు గంగాధర్. సాధారణంగా మరాఠాలు తమ పేరుతో..తండ్రి పేరుని కలుపుకుంటారు. అయితే, ఈ సంప్రదాయానికి భిన్ంగా ఈసారి ఫడ్నవీస్ తల్లి పేరునీ జోడించారు. గత ఎన్నికల అఫిడవిట్లలో, సీఎంగా ప్రమాణం చేసినప్పుడు కూడా ఆయన‘దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ అనే నేను’ అంటూనే పలికారు. ఫడ్నవీస్ యుక్త వయసులో ఉన్నప్పుడే తండ్రి కేన్సర్‌తో చనిపోయారు.