Stalin Support: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతును ఆయన కూడగడుతున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ఇవాళ కలిశారు.
కేంద్రం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని డీఎంకే చీఫ్‌ను కోరగా, సహకరిస్తామని స్టాలిన్ కేజ్రీవాల్ కు భరోసా ఇచ్చారు.ఈ రాజ్యాంగ విరుద్ధమైన చర్యను ఎలా వ్యతిరేకించాలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ముఖ్యమంత్రుల నుండి మద్దతు ఎలా పొందాలో మేము చర్చించామని సిఎం స్టాలిన్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాన్ని అణగదొక్కడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను డిఎంకె తన నాయకత్వంలో ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు., ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే బీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను శుక్రవారం కలిసి మద్దతు కోరనున్నారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఊరట ఇచ్చింది. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూ వ్యవహారాలు తప్పించి మిగతా అన్ని శాఖలపై అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న ఈ మేరకు చారిత్రక తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రం పెత్తనం చెలాయించే అధికారుల బదిలీలకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో అధికారుల పోస్టింగులకు సంబంధించి ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తెచ్చింది. కాగా, పార్లమెంట్‌లోని ఎగువ సభలో ప్రతిపక్షాలకు బలం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్స్‌ను అక్కడ ఎదుర్కొనేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగడుతున్నారు.