Arundhati Roy: తాజాగా అరుంధతీయ రాయ్, మాజీ కశ్మీర్ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అత్యంత కఠిన చట్టం కింది కేసు నమోదు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. కాగా న్యూఢిల్లీలో 2010లో జరిగిన ఓ సదస్సులో ఆమె రెచ్చగొట్టే స్రసంగం చేశారనేది ఆమెపై ప్రధానమైన ఆరోపణ. దీంతో ప్రతిపక్షాలకు.. భారతీయ జనతాపార్టీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అరుంధతి రాయ్‌తో పాటు షేక్ షౌకత్ హుస్సేన్‌లపై ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు రాజ్‌నివాస్ అధికారులు శుక్రవారం నాడు తెలిపారు.
రాజకీయపార్టీల ఆగ్రహం..(Arundhati Roy)
కాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) అరుంధతి రాయ్‌కు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని ఖండించింది. ఇది ఫాసిస్టు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎల్‌జీ అరుధంతి రాయ్‌ను అత్యంత కఠినమై యూఏపీఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరింది. కాగా ఈ ప్రసంగం 14 ఏళ్ల క్రితం చేసిన ప్రసంగంపై ఇప్పుడు కేసు నమోదు చేయడం పట్ల సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పక్కా ఫాసిస్టు చర్య అని పేర్కొంది. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో లాయర్లు అందుబాటులో లేని సమయంలో కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. ఇది సిగ్గు చేటు చర్య అని సీపీఐ (ఎం) ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్ బీకె కూడా తాజా పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యంగా మేధావులు, కళాకారులు, కవులు, రచయితలపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో చర్య చేపడుతోందన్నారు. బీజేపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి వాస్తవాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇది భావ వ్యక్తీకరణపై దాడి .. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తే ఒప్పుకొనేది లేదని హరిప్రసాద్ బీకె ఎక్స్ ద్వారా స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా అరుంధతికి మద్దతుగా నిలిచారు.భారతీయ ఓటర్లు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఫాసిజానికి వ్యతిరేకంగా ఓటు వేశారని మహువా మొయిత్రా గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ కూడా కాంగ్రెస్‌పై మండిపడింది. వేర్పాటు వాదులు, టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు సానుభూతి చూపడం పట్ల అభ్యతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎస్‌డీపీఐకి మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం వారి నుంచి మద్దతు కోరుతోంది. ఇప్పుడు వేర్పాటు వాదుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోంది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదా అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్‌లో నిలదీశారు. అఫ్జల్, యాకూబ్ లాంటి వారిని కాంగ్రెస్‌పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టెర్రరిస్టులను వెనకేసుకొస్తోందన్నారు పూనావాలా.
కేసు దేనికంటే..
ఇంతకు అరుంధతి , షేక్ షౌకత్ హుస్సేన్ అక్టోబర్ 21, 2010న న్యూఢిల్లీలోని కోపెర్నికస్ మార్గ్‌లోని ఎల్‌టీజీ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో అరుంధతి, షౌకత్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఆజాదీ, ది ఒన్లీ వే అనే బ్యానర్‌పై జరిగిన సదస్సులో వారు ఇండియా నుంచి కశ్మీర్‌ను వేరే చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సదస్సులో సయ్యద్ అలీ షా గిలానీ, ఎస్‌ఏఆర్ గిలానీ .. ఈయన పార్లమెంటుపై దాడి చేసిన కేసులో నిందితుడు, అరుంధతి రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్, వరవరరావులున్నారు. అయితే వీరికి వ్యతిరేకంగా నవంబర్ 27, 2010లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ ఎల్‌జీ అరుంధతి, షౌకత్‌లపై అత్యంత కఠినమైన ఉపా కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.