Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇప్పటికీ ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దానితో ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. బుధవారం అర్థరాత్రి వరకు యుమన నది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరుకుంది. ఇక గురువారం వరుకు ఈ వరద ఉద్ధృతి మరింత ఎక్కువ కావటంతో ఉదయం 7 గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. కాగా ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని నదిలోకి విడుదల చేయడంతో వరద ఉద్ధృతి మరింత పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బ్యారేజీ నుండి నీటి విడుదలను నిలిపివేయాలని కోరారు. దీనితో కేంద్రం ఆ మేరకు చర్యలు చేపట్టింది.
దీనితో సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. యమునా నది నీటిమట్టం క్షణక్షణానికి పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు జిల్లాలపై యమునా వరద ప్రభావం కనిపిస్తుంది. ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, షహదారా, సెంట్రల్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ సౌత్ ఈస్ట్ ఢిల్లీలోనూ వరద ప్రభావం కనిపించింది. యమునా పరివాహక ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరదనీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 20వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా మొత్తంగా లోతట్టు ప్రాంతాల్లో 46వేల మంది నివాసం ఉంటున్నట్లు సమాచారం. వారంతా ఇల్లు వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పలు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్ –మంజు కా తిలాని కలిపే ప్రాంతమంతా భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడి ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఇకపోతే ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉందని కనుక ఈ వరద ఉద్ధృతి మరింత పెరిగితే సీఎం ఇంటిని కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది.