Delhi CM Rekha Gupta : శీష్ మహల్‌లో కూర్చొని పనిచేసే సీఎంను కాను అని రేఖాగుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు. ఆప్ అధికారంలో ఉన్నంత కాలం ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. శీష్ మహల్ నిర్మించుకోడటంలో బిజీగా ఉన్నట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌లా తాను మహల్‌లో కూర్చొని పని చేసే ముఖ్యమంత్రిని అసలే కానన్నారు. 24 గంటలు ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తా..
ఢిల్లీలో మహిళను ముఖ్యమంత్రి చేయటంతో సులువుగా అధికారం తమ చేతిలో పెట్టుకోవచ్చని బీజేపీ నేతలు పదవిని కట్టబెట్టినట్లు వస్తున్న వార్తలపై రేఖా గుప్తా సమాధారం ఇచ్చారు. మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవంతోనే దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి చేశారన్నారు. సీఎం పదవిలో ఉన్న తనను కేవలం ఢిల్లీ ప్రజల మాత్రమే నియంత్రించగలరని చెప్పారు. పార్టీ నేతలు కేవలం తనకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తారే తప్ప అధికారం తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచన ఉండదన్నారు. తామంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కలిసి కట్టుగా దేశ రాజధానిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవి చేపట్టిన తొలి రోజే శీష్ మహల్‌లో ఉండనని చెప్పానన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును విశ్రాంతి, సౌకర్యం కోసం ఉపయోగించుకునే హక్కు తనకు లేదని, ఆ ఆస్తి ఢిల్లీ ప్రజలది అని సీఎం రేఖా గుప్తా అన్నారు.
ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అధికారిక నివాసంగా ఉపయోగించిన బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా బీజేపీ అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అరవింద్ 7 స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. కేజ్రీవాల్ మోసాలకు ఆ మహల్ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీశాయి.