ADR Report: గురువారం నాడు జరగబోతున్న తెలంగాణ శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల విషయానికి వస్తే 24 శాతం నుంచి 72 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ రికార్డులున్నాయని తేలింది. పోటీ చేస్తున్న అన్ని పెద్ద పార్టీలు తమ పార్టీ అభ్యర్థులపై క్రమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల శాసనభల విషయానికి వస్తే మిజోరాం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణకు చెందిన మొత్తం 8,054 మంది అభ్యర్థులు పోటీ చేసారు. వారిలో సుమారు 18 శాతం మంది అభ్యర్థులపై క్రమినల్ కేసులు నమోదయ్యాయని ఎడీఆర్ తాజా నివేదికలో పేర్కొంది.
తెలంగాణలో అత్యధిక కేసులు..( ADR Report)
ఎన్నికల్లో పోటీ చేస్తున్న 12 శాతం మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ చార్జీలు నమోదు కాగా.. 29 శాతం మంది అభ్యర్థులు మాత్రం కోటీశ్వరులు, సరాసరి వారి ఆస్తుల విలువ 3.36 కోట్లుగా తేలింది. కాగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో క్రిమినల్స్‌ను పోటీకి నిలబెట్టడంపై కూడా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం సుప్రీంకోర్టు సూచనలను కూడా పెడచెవినపెట్టాయి. పాత పద్దతుల వైపే మొగ్గు చూపాయి. అన్నీ పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులను పోటీకి నిలబెట్టాయని ఎడిఆర్ నివేదికలో వివరించింది. ఇక అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను పరిశీలిస్తే.. తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై అత్యధికంగా ఉన్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్థుల క్రిమినల్ రికార్డును పరిశీలిస్తే 24 శాతం నుంచి 72 శాతం వరకు ఆక్రమించాయి. ఇక కేసుల విషయానికి వస్తే 45 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించినవి.. 27 కేసులు హత్యాయత్నానికి సంబందించినవి కాగా 7 హత్య కేసులు నమోదయ్యాయి.
మిజోరంలో అతితక్కువ కేసులు..
ఇక అతి తక్కువ క్రిమినల్ కేసులు నమోదైన రాష్ర్టం విషయానికి వస్తే మిజోరంను చెప్పుకోవచ్చు. ఇక్కడ మూడు శాతం నుంచి పది శాతం వరకు మాత్రమే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాగా అభ్యర్థుల విషయానికి వస్తే అన్నీ రాజకీయపార్టీల అభ్యర్థులపై క్రిమినల్ కేసులు రికార్డు అయ్యాయి. అయితే మిజోరంలో మాత్రం మహిళపై నేరాలు చేసిన కేసులు లేవు. అలానే హత్యాయత్నం కేసులు, హత్య కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా -మార్క్సిస్టు విషయానికి వస్తే 68 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 43 శాతం అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ చార్జీలు నమోదయ్యాయి.