COVID Cases: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ కూడా నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
DG ICMR Dr Rajiv Bahl and Secy, MoHFW Rajesh Bhushan write to all States/UTs on maintaining optimum testing for Covid-19 pic.twitter.com/xS5ycvqYa1
— ANI (@ANI) March 25, 2023
కాగా, గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 8,601 కి పెరిగింది. గత 146 రోజుల్లో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే విధంగా తాజాగా మరో 6 కోవిడ్ -19 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుంచి ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు మరణించారు.
గత 24 గంటల్లో 910 మంది కోలుకోవడంతో.. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832 కి చేరుకుంది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు1.33 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.23 శాతంగా ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు . గత 24 గంటల్లో మొత్తం 1,19,560 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు 92.08 కోట్ల పరీక్షలు జరిగాయి. రోజువారీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది.