Mallikarjuna Kharge Defamation case:కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. 100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
భజరంగ్ దళ్‌ను నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనిపై భజరంగ్ దళ్ కోర్టును ఆశ్రయించింది. విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ సంగ్రూర్ కోర్టులో పిటిషన్ కేసు దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్‌దళ్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఖర్గేపై వంద కోట్ల పరువు నష్టం కేసు వేశారు.
దీనిపై సినీయర్ డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10 న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని భరద్వాజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు.