Prime9

Bengaluru Stampede: అప్పుడు వారికి రాజీనామా గుర్తుకు రాలేదా..?: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కౌంటర్‌!

Karnataka CM Siddaramaiah on Over Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతికి బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతల డిమాండ్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తనను రాజీనామా అడిగే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల గతంలో జరిగిన విషాదాలకు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేసిన బీజేపీ నేతల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

గుజరాత్‌లోని మోర్బిలో ఓ వంతెన కూలిన ఘటనలో అనేకమంది మృతిచెందారని గుర్తుచేశారు. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలోనూ 30 మంది యాత్రికులు మృతిచెందారని తెలిపారు. ఈ విషాద ఘటనల సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయలేదు సరికదా అని ప్రశ్నించారు. దర్యాప్తు కూడా తగిన విధంగా చేపట్టలేదని మండిపడ్డారు. ఇప్పుడు తనను ప్రశ్నించేందుకు బీజేపీ నేతలకు ఏం నైతికత ఉందని ఆయన నిలదీశారు.

 

దేశంలోని విమాన ప్రమాదాలు, రైల్వే విషాదాల్లో చాలామంది మృతిచెందారని, కొన్నేళ్లుగా మణిపుర్‌ మండుతూనే ఉందని, రోజూ ప్రజలు చనిపోతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వంతెనలు కూలిపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, ఘటనకు బాధ్యత వహిస్తూ బీజేపీ రాజీనామా చేసిందా? అని ప్రశ్నించారు. ఇది తను సాకుగా చూపి చెప్పడం కాదన్నారు. ఇదంతా వాస్తవం అన్నారు. మనుషుల ప్రాణాలు, బాధలతో రాజకీయాలు చేయడం తగదని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు.

 

కర్ణాటకలోని తమ ప్రభుత్వం 7 కోట్ల మంది కన్నడిగులకు జవాబుదారీగా ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు. తొక్కిసలాట ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. కఠిన చర్యలకు తాము వెనుకాడబోమని తేల్చి చెప్పారు.

 

Exit mobile version
Skip to toolbar