Prime9

PM Modi- Omar Abdullah : ప్రధాని మోదీ త్వరలో నన్ను ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నా.. జమ్మూకశ్మీర్ సీఎం

PM Modi-Jammu and Kashmir CM Omar Abdullah : ప్రధాని మోదీ తనను త్వరలో ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మోదీ వద్ద రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

2014లో జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చినప్పుడు తను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నానని పేర్కొన్నారు. తాను ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా డిమోట్ అయ్యాయనని తెలిపారు. అప్పుడు రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న వ్యక్తికి లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా ప్రమోషన్ వచ్చిందని గుర్తుచేశారు. త్వరలో తనకు ప్రమోషన్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. దీన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం పట్టదనుకుంటున్నానని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ఎల్‌జీగా మనోజ్‌ సిన్హా ఉన్నారని, జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ఒమర్‌ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు, జమ్మూకశ్మీర్‌‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

 

జమ్మూకశ్మీర్‌కు గతేడాది ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ)-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌కు మొదటి ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రాష్ట్ర హోదాకోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకొని తాను జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రహోదాను డిమాండ్‌ చేయాలని, తనవి అంత చౌకబారు రాజకీయాలు కావని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్ర హోదా అడిగామని, భవిష్యత్‌లో కూడా అడుగుతామని చెప్పారు. కానీ, 26 మంది చనిపోయారని, ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటని గతంలో వ్యాఖ్యానించారు. తాజాగా చినాబ్‌ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ఎదుట మళ్లీ తన డిమాండ్ వినిపించారు.

Exit mobile version
Skip to toolbar