West Bengal CM Mamata : వక్ఫ్ చట్టం అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో మొదలైన నిరసనలు చివరికి ఉద్రిక్తంగా మారాయి. అల్లర్లపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆమె మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడి కొందరు గూండాలు యువకులను టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమయ్యారని ఆమె ఆరోపించారు.
మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం..
బెంగాల్‌లో హింస వెనుక ఉన్న కుట్రదారులను త్వరలో ప్రజల ముందుకు తీసుకువస్తానని సీఎం మమత శపథం చేశారు. హింసలో మృతిచెందిన వారి కుటుంబాలకు సర్కారు తరఫున తలా రూ.10లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో వచ్చే నెల మొదటి వారంలో పర్యటిస్తానని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న బంగ్లార్ బారి పథకం కింద వారి ఇళ్లను పునర్ నిర్మిస్తామని హామీనిచ్చారు.
280 మంది అరెస్టు..
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పచ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ పట్టణంలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో రోడ్లను దిగ్బంధించారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో 280 మందిని అరెస్టు చేశారు. అల్లర్లలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో వందల మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. హింసలో ఉగ్రసంస్థల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని చెబుతున్నాయి.