AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అరకు కాఫీతోపాటు జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అమిత్ షాతో సమావేశమై వివిధ అంశాలపై గంటపాటు చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను కలిశారు. చంద్రబాబుతోపాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిర్మలమ్మను కలిసి ఏపీ బడ్జెట్ ప్రతులను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రెండు కీలక సమావేశాలు..
రెండు కీలక సమావేశాలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయ పరిణామాల గురించి హోం మంత్రి అమిత్ షాతో చర్చించామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మునుముందు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చినట్లు చెప్పారు. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భూముల కంప్యూటరీకరణలో చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. గతంలో నాయకులు, అధికారులు కలిపోయారని తెలిపారు. దీంతో ప్రైవేట్ భూములను బలవంతంగా 22Eలో చేర్చారని పేర్కొన్నారు. గతంలో అటవీ భూములను ఆక్రమించారన్నారు. సందప సృష్టించలేని వారికి సంక్షేమం పేరుతో పంపకం చేసే హక్కులేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బనకచర్ల లింక్ ఏర్పాటు చేయాలి..
నదుల అనుసంధానంతో పోలవరం-బనకచర్ల లింక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని నీటి ఎద్దడిని తీరుస్తామన్నారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలన్నారు. ఏపీలో గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపినట్లు గుర్తుచేశారు. ఏపీలో గంజాయి మాట వినిపించకుండా చేస్తామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని, ప్రజలు తమ వైపు ఉన్నారడానికి ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయడంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.