Chandigarh Traffic Violations: మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం అంటే కొందరికి సరదా.. మరి కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ నిబంధనలు అలవొకగా ఉల్లంఘిస్తుంటారు. అయితే దేశంలోని చండీఘడ్‌ను తీసుకుంటే గత 15 నెలల్లో 18 లక్షల రెడ్ లైట్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. వాటిలో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో నాలుగు లక్షల ఉల్లంఘనలు జరిగాయి. ఈ వివరాలను చండీఘడ్ స్మార్ట్ సిటి లిమిటెడ్ వెల్లడించింది.
మూడు నెలల్లో నాలుగు లక్షల కేసులు..(Chandigarh Traffic Violations)
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి నాటికి చూస్తే 3,93,525 నిబంధనలు ఉల్లంఘనలు జరగ్గా.. 1.15 లక్షల కేసులకు సంబంధించి స్పాట్ చాలన్‌లు జారీ చేయడం జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి 31 వరకు 3.93 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు కెమెరాకు చిక్కాయి. రెడ్ లైట్ జంపింగ్ కేసులను పక్కన పెడితే 66,337 కేసులు ఈ ఏడాది మూడు నెలల కాలంలో స్పీడింగ్ కేటగిరిలో నమోదయ్యాయి. దీనికి సంబంధించి 58,910 చాలన్లు జారీ చేయడం జరిగింది. వాహనదారుడు నిబంధనలు ఉల్లంఘించినట్లు కెమెరాకు చిక్కన వెంటనే వివరాలు తెలుసుకొని వారి ఇంటికి చలాన్లు పంపడం జరుగుతోంది. అయితే కొన్ని వాహనాలకు మినహాయింపు ఉంటుంది. వాటిలో ఫైర్ టెండర్లు, అంబులెన్స్‌లు రెడ్ సిగ్నల్స్ దాటిపోయినా అత్యవసర సర్వీసులు కాబట్టి వాటికి మినహాయింపు ఇస్తామని అధికారులు చెప్పారు. ఎమర్జెన్సీ వాహనాలను సాఫ్ట్‌వేర్ గుర్తించడంలో విఫలం అవుతోంది. అందుకే తాము వెరిఫై చేసిన తర్వాత మాత్రమే చలాన్లు విడుదల చేస్తున్నామన్నారు.
గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 14,01,441 రెడ్‌లైట్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు రికార్డు అయ్యాయి. వాటిలో 2,24,158 ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవి. గత ఏడాది స్పీడింగ్ కేసుల చాలన్ల విషయానికి వస్తే 1,91,627 చాలాన్లు జారీ అయ్యాయి. అలాగే 2022 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 2023 వరకు మొత్తం 5,47,900 కేసుల విషయానికి వస్తే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందకు చాలన్లు జారీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు యధేచ్చగా జరుగుతున్న నేపథ్యంలో చండీగడ్‌లో మొత్తం 900 సీసీటీవీలు ఇన్‌స్టాల్ చేసి ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఇదిలా ఉండగా ఇలా సీసీటీవీలను చండీఘడ్ నగరం మొత్తం బిగించడం వల్ల సుమారు 500 క్రిమినల్ కేసులను పరిష్కరించడం జరిగింది. ఉదాహరణకు హత్యలు, గొలుసు దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, హిట్ అండ్ రన్ కేసులను, మోటార్ వాహనాల దొంగతనాలను, దొంగతనాలను అరికట్టగలిగామని పోలీసు అధికారులు వివరించారు.