Viral News : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో అనుకోని దుర్భాటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత మంగళవారం తన్మయ్ అనే 8 ఏళ్ల బాలుడు పొలం దగ్గర ఆడుకుంటూ… ప్రమాదవశాత్తు దగ్గర్లోని బోరు బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న తన్మయ్ సోదరి దీన్ని గమనించి వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు వెంటనే బోరుబావి వద్దకు చేరుకొని తన్మయ్ ని కాపాడే ప్రయత్నం చేశారు.
కానే ఆ బోరు బావి 55 అడుగుల లోతు ఉండడంతో వారికి సాధ్యపడలేదు. కానీ తల్లిదండ్రుల పిలుపునకు తన్మయ్ స్పందించడంతో బాలుడు క్షేమంగానే ఉన్నట్లు అంతా భావించారు. ఇక ఈ ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ పనుల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. బాలుడిని క్షేమంగా రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే బోరు బావి 55 అడుగుల లోతు ఉండటంతో బాలుడిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. మరోవైపు అధికారులు బాలుడికి ఆక్సిజన్, ఆహారం అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికి బాలుడి నుంచి ఎలాంటి స్పందనా లేదని, అతడి పరిస్థితి ఏంటో చెప్పలేమని అధికారులు చెప్పారు.
ఇక ఈరోజు వేకువ ఝామున అధికారులు బాలుడిని బయటికి తీశారు. వెంటనే ప్రత్యేక అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా… అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికి మళ్ళీ పలు తప్పిదాలు వల్ల పునరావృతం అవుతున్నాయి. బోరుబావులను తెరిచి ఉంచవద్దంటూ అధికారులు, ప్రభుత్వం సూచిస్తున్నారు. వీరి లానే మరో చిన్నారుల తల్లిదండ్రులకు కడుపు కోత మిగలకూడదని కోరుకుందాం.