Border Dispute : సరిహద్దు వివాదం.. కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న 11 మహారాష్ట్ర గ్రామాలు

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్‌కోట్ తహసీల్‌కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.

  • Written By:
  • Publish Date - December 6, 2022 / 02:27 PM IST

Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్‌కోట్ తహసీల్‌కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీలు ఆమోదించిన ప్రతిపాదనను గ్రామస్తుల బృందం జిల్లా కలెక్టర్‌కు సమర్పించింది. రహదారులు, విద్యా, ఆరోగ్య సదుపాయాల లేమిని ఎత్తిచూపుతూ, తాము మహారాష్ట్రలో భాగమవ్వాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.

ప్రతినిధి బృందంలోని ఓ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లోని 28 గ్రామాలపై మహారాష్ట్ర ఎందుకు సవతి తల్లిప్రేమను చూపుతుందో తెలియడం లేదని అన్నారు… 28 గ్రామాల్లో కనీస వసతులు లేవని.. కర్ణాటకతో పోల్చి చూస్తే 100 ఏళ్లు వెనుకబడి ఉన్నామని అన్నారు. రైతుకు బజారుకు వెళ్లేందుకు రోడ్డు లేదు.. కర్ణాటకలో ఉచిత కరెంటు, నీళ్లు అందిస్తున్నారని అక్కలకోటకు ఏనాడూ నీళ్లు అందలేదన్నారు. తమ గ్రామం మహారాష్ట్రలో ఉందో లేదో మాకు తెలియదని పేర్కొన్నారు.

బెలగావి వంటి ప్రధానంగా మరాఠీ మాట్లాడే ప్రాంతాల హోదాపై మహారాష్ట్ర మరియు కర్ణాటకల మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని జాట్ తాలూకాలోని కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని ఆమోదించిన తీర్మానాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ రాష్ట్రంలోని ఏ గ్రామాన్ని కర్ణాటకకు అప్పగించబోమని చెప్పారు. దీనిని బొమ్మై ‘రెచ్చగొట్టే’ వ్యాఖ్యగా అభివర్ణించారు.అంతేకాదు మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలపై దావా వేశారు.