Mumbai: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ‘అధిష్’ బంగ్లా నిర్మాణం అక్రమమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. రెండు వారాల్లోగా బంగ్లా నిర్మాణాన్ని కూల్చివేయాలని పరిపాలనను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో రాణేకు హైకోర్టు 10 లక్షల జరిమానా విధించింది. ఎఫ్‌ఎస్‌ఐ, సీఆర్‌జెడ్‌లను ఉల్లంఘించారని నారాయణ్ రాణే పై ఆరోపణలు వచ్చాయి. ఈ బంగ్లాలో అక్రమ నిర్మాణం కోసం చేసిన దరఖాస్తును మున్సిపాలిటీ పరిగణించరాదని కోర్టు తెలిపింది. ముంబైలోని జుహులో సముద్రం పక్కనే ఈ బంగ్లా ఉంది.
ఈ బంగ్లా పై సంతోష్ దౌండ్కర్ పిటిషన్ వేశారు. ఈ విషయం పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నారాయణ్ రాణేకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ బంగ్లాను మున్సిపల్ బృందం తనిఖీ చేసింది. ఆ సమయంలో బీజేపీ, శివసేన మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదిలా ఉండగా, బంగ్లా నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలంటూ దాఖలైన మొదటి దరఖాస్తును తిరస్కరించినప్పటికీ, అదే డిమాండ్‌తో రెండోసారి దరఖాస్తు చేసుకున్నా వ్యతిరేకించకపోవడం పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వైఖరి పై కొద్దిరోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ గతంలో ఈ నిర్మాణాన్ని అక్రమంగా గుర్తించి క్రమబద్ధీకరించడానికి నిరాకరించింది.