Site icon Prime9

Maharashtra CM: మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర పడ్నవీస్.. గవర్నర్‌ను కలవనున్న మహాయుతి నేతలు

BJP Announces Devendra Fadnavis As New CM of Maharashtra: మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఖరారయ్యారు. ఈ మేరకు బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ తదితరులు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. మిగతా సభ్యులంతా ఆమోదించారు.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మహాయుతి నేతలు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణణ్‌ను కలవనున్నారు. డిసెంబర్ 5వ తేదీన ముంబై ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పడ్నవీస్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు.

ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కీలక భేటీ అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర పడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

ముంబైలోని ఆజాద్ మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎంగా పడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవర్, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరుకానున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లల్లో మహాయుతి కూటమి అత్యధికంగా 230 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ అత్యధికంగా 132 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు గెలుచుకుంది. ఇక, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

Exit mobile version