Biporjoy Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఈ తుపాను తీరం వైపు కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారీ గాలుల నేపథ్యంలో కొన్ని విమానాలను రద్దు చశారు. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ల్యాండింగ్ సమస్య ఉండటంతో మరికొన్ని విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు విమానాలు రద్దు(Biporjoy Cyclone)
ఈ అంశంపై అప్ డేట్ ఇస్తూ ఎయిరిండియా ట్వీట్ చేసింది. ‘వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముంబై ఎయిర్ పోర్టులోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా క్లోజ్ం చేశారు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆలస్యాన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ఎయిరిండియా తెలిపింది. మరో వైపు ఇండిగో సంస్థ కూడా ‘తప్పనిసరి పరిస్థితుల్లోనే విమానాలు ఆలస్యమవుతున్నాయి’ అని పేర్కొంది. అయితే, ఎయిర్‌పోర్టులో గంటల కొద్దీ ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ(Biporjoy Cyclone)
కాగా, బిపోర్‌జాయ్ తుపాను ఈ నెల 15వ తేదీన గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య తీరాన్ని దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన బిపోర్ జాయ్ తుపాను.. గంటలకు 8 కిలో మీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135 నుంచి 150 కి. మీల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కచ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు గుజరాత్ తీరంలో కూడా అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో జూన్ 15 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. మరో వైపు, తుపాను ప్రభావంతో ముండైలో సోమవారం వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.