Big Relief to Rahul Gandhi In Defamation Case at Supreme Court: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో జార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై దాఖలైన పరువునష్టం కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో జార్ఖండ్‌లోని చైబాస నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇందులో భాగంగానే ఆయన కేంద్ర హోం మంత్రిని ‘మర్డరర్’గా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలు కేంద్ర హోం మంత్రి గౌరవానికి, పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఓ బీజేపీ కార్యకర్త నవీన్ ఝా.. రాహుల్ గాంధీ మీద పరువునష్టం కేసు దాఖలు చేశారు.
కొట్టేయాలని రాహుల్ వాదన
తొలుత ట్రయిల్ కోర్టులో దీనిపై విచారణ జరగగా, తనపై దాఖలైన కేసులో పసలేదని, దానిని కొట్టివేయాలని రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చడంతో దానిని సవాలు చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన సుప్రీం ధర్మాసనం ట్రయిల్ కోర్ట్ విచారణపై స్టే విధించింది. రాహుల్ అప్పీల్‌పై సమాధానం తెలియజేయాలని జార్ఖండ్ ప్రభుత్వానికి, నవీన్ ఝాకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయాలని, ప్రాక్సీ పార్టీ ద్వారా ఫిర్యాదు చేయలేమని గతంలో న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.