Babli Project Case: మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు లో చుక్కెదురైంది . 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి సంబందించిన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది . దీనికి సంబంధించి న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 10న తీర్పు వెలువరించింది.
బాబ్లీ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా నిరసన..( Babli Project Case)
2010 జూలైలో చంద్రబాబు ఇతర టీడీపీ నేతలు గోదావరి పై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కు వెళ్లారు .ఆ సందర్భంలో మహారాష్ట్ర పోలీస్ లకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది .దీనిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసారు . మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించ డానికి ప్రయత్నించారని కేసు నమోదు చేసారు . ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టేసింది.
చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆందోళనలు, నిరసనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నారని, ఆ కేసులో నిందితులందరినీ మెజిస్ట్రేట్ వెంటనే విడుదల చేశారన్నారు. దాడి కేసులో పోలీసులు కావాలనే చంద్రబాబును, నక్కా ఆనంద్ బాబును ఇరికించారని అయన అన్నారు . జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అధికారం జైళ్ల సూపరింటెండెంట్‌కు మాత్రమే ఉందని వాదించారు .ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీనియర్ జైలర్ అని, ఆయనకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది.