Atal Bihari Vajpayee: అవని భారతి ముద్దుబిడ్డ.. అటల్..!

Atal Bihari Vajpayee: దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర! తన అబ్బురపరమైన వాగ్ధాటితో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, రాజకీయ చతురతతో, అసమానమైన రాజనీతిజ్ఞతతో జాతి జనుల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు.. అటల్ బిహారీ వాజ్‌పేయి. కవిగా, రచయితగా, గొప్ప వక్తగా, అసాధారణ ప్రజ్ఞావంతుడిగా, ధీరోదాత్తత గల పాలకుడిగా పేరొందిన వాజ్‌పేయి జీవితంలో ప్రతి అడుగూ ఓ మైలురాయేనంటే అతిశయోక్తి కాదేమో! గ్వాలియర్‌కు చెందిన ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1924 డిసెంబర్‌ 25న జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదిగారు. తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్‌పేయి. తండ్రి స్కూల్‌ టీచర్‌, రచయిత కూడా. గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్‌ విద్యాలయంలో ప్రాథమిక విద్య, విక్టోరియా కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్, కాన్పూర్‌లోని దయానంద్‌ ఆంగ్లో- వేదిక్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ పట్టా పొందారు. 1939లో ఆరెస్సెస్‌లో చేరి, 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారారు. అదే సమయంలో హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలైన స్వదేశ్, వీర్‌ అర్జున్‌లలో పని చేశారు.

ఆ సమయంలోనే ఆయనకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. బ్రహ్మచారిగా ఉన్న పాత్రికేయుడు పూర్తికాలపు రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. డా. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్‌(బీజేఎస్‌)లో చేరి, తక్కువ సమయంలోనే పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. రెండవ లోక్‌సభ ఎన్నికల్లో బలరాంపూర్‌ నుంచి తొలిసారిగా గెలిచి తన అసాధారణ ప్రతిభతో నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరి దృష్టినీ ఆకర్షించారు. అటుపై 1968లో జనసంఘ్‌ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నానాజీ దేశ్‌ముఖ్, బల్‌రాజ్‌ మధోక్, ఎల్‌కే అద్వానీలతో కలసి పార్టీని విస్తరించారు. ఇందిర తెచ్చిన ఎమర్జెన్సీలో జయప్రకాశ్‌ నారాయణ్ నేతృత్వంలో ఉధృతంగా సాగిన ఉద్యమంలోనూ వాజ్‌పేయి చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనసంఘ్‌ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో ఏర్పడిన జనతా సర్కారులో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు. అప్పటికే జాతీయ నేతగా ఓ ప్రత్యేక మైన స్థానాన్ని అటల్ జీ సంపాదించుకున్నారు. అనంతరం 1980లో అద్వానీ, భైరాన్‌సింగ్‌ షెకావత్‌ తదితరులతో కలసి వాజ్‌పేయి బీజేపీని స్థాపించారు. ఇందిర హవా సాగుతున్న రోజుల్లోనూ ఆమెతో సమానమైన జనప్రియ నేతగా గుర్తింపు పొందారు. ఇందిర హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండే సీట్లు గెలుచుకున్నప్పటికీ, బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుతూనే లోక్‌సభలో విపక్ష వాణిని వినిపించారు. ఆ తర్వాత జరిగిన అద్వానీ రథయాత్రను సమర్ధించిన వాజ్‌పేయి, 1992 డిసెంబర్‌ 6నాటి బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘అనాలోచిత చర్య’గా అభివర్ణించారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డును అందుకున్నారు. ‘పార్టీకి, దేశానికి ఏది మంచిది అనే లక్ష్మణరేఖను ఎవరికి వారు గౌరవించి, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే, దీర్ఘకాలం పాటు బంధాలు నిలబడతాయి’ అంటూ లాల్‌కృష్ణ అడ్వాణీతో తన దశాబ్దాల సాన్నిహిత్య రహస్యాన్ని వాజ్‌పేయీ వెల్లడించారు.

తొంభైయ్యవ దశకం నాటికి బీజేపీకి క్రమంగా ఆదరణ పెరగటంతో 1996 సార్వత్రిక ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా నిలవటంతో కొన్ని మిత్రపక్షాల సాయంతో వాజ్‌పేయి దేశ పదవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదమూడు రోజుల పాలన తర్వాత లోక్‌సభలో తన విశ్వాస పరీక్షకు తగిన బలం లేకపోవటంతో రాజీనామా చేశారు. ‘అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం, అనైతిక పద్ధతులూ అవలంబించం. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు’ అంటూ ఆనాటి లోక్‌సభలోని చారిత్రక ప్రసంగంలో అటల్ జీ మాట్లాడిన మాటలు.. ఆయన నైతిక నిష్ఠకు ఘనతర ప్రతీకగా నిలిచాయి. తర్వాత 1998లో మరోసారి మిత్రపక్షాలను కూడగట్టిన బీజేపీ.. వాజ్‌పేయి నాయకత్వంలో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడే (1999 మే) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో పాక్‌తో శాంతిచర్చలకు శ్రీకారం చుట్టి, ఢిల్లీ-లాహోర్‌ మధ్య చరిత్రాత్మక బస్సు సర్వీసును ప్రారంభించారు. వాజ్‌పేయి మంచితనాన్ని బలహీనతగా భావించిన పాక్‌.. కయ్యానికి కాలుదువ్వి కార్గిల్‌ దురాక్రమణకు పూనుకోగా, వార్‌‘ఆపరేషన్‌ విజయ్‌’‌కు ఆదేశాలిచ్చి పాక్‌కు గట్టి షాకిచ్చి, అంతర్జాతీయంగా పాక్ కుట్రను వాజ్‌పేయి రుజువుచేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీ మద్దతును ఉపసంహరించుకోవటంతో 13 నెలలకే వాజ్‌పేయి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించటంతో 1999 అక్టోబర్‌ 13న వాజ్‌పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999-2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తన పాలనా కాలంలో పీవీ ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణల రథాన్నికొనసాగిస్తూనే, మరిన్ని కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలను అమల్లోకి తెచ్చారు. దేశం నాలుగు మూలలు కలుపుతూ స్వర్ణ చతుర్భుభి పథకంతో బాటు ప్రధానమంత్రి గ్రామ్ సడక్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే, ద్రవ్యలోటును తగ్గించారు. జీడీపీలో ప్రభుత్వ రంగం వాటా 2000 నాటికి 0.8 శాతం ఉండగా, ఈ సంస్కరణల అనంతరం 2005 నాటికి అది 2.3 శాతానికి చేరింది. టెలికమ్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను భారత్‌కు ఆహ్వానించి ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజాలు వేసి, పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాకు దగ్గరవుతూనే పాక్‌కు స్నేహహస్తం చాచారు. నాటి పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ను ఆగ్రా ఆహ్వానించి చర్చలకు తెరతీశారు. కానీ, కశ్మీర్‌ అంశంపై ముషార్రఫ్‌ పట్టుపట్టడంతో ఆ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మూడవ సారి ఆయన ప్రధానిగా ఉండగా, 1999 డిసెంబర్‌లో కాందహార్‌లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేశారు. అలాగే 2001 డిసెంబర్‌ 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. 2002లో గుజరాత్‌లో గోధ్రా ఘటనతో అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో ఆయన తన రాజధర్మాన్ని నిర్వర్తించారు. ప్రజాజీవితంలో ఆయన అందించిన సేవలకు 1993లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, 1994లో లోకమాన్య తిలక్ పురస్కారం, 1994లో గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు, 2015లో భారత రత్న అవార్డు వరించాయి. ‘శిఖరం ఎప్పుడూ ఒంటరిదే. దానిని ఆత్మీయంగా హత్తుకోవటానికి ఎవరూ రారు. దానిని అధిరోహించటం ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ, దానికి తోడుగా ఉండటానికి ఒక్కరూ ఉండరు’అంటూ తన మనసులోని భావాలను అనేక కవితలుగా మలచిన అటల్‌జీ 2018 ఆగస్టు 18న తన 93వ ఏట తన జీవన ప్రయాణాన్ని ముగించారు. వికాస పురుషుడిగా, భరతమాత ముద్దు బిడ్డగా జాతి జనుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆ మహనీయడి జయంతిని భారత ప్రభుత్వం ఏటా ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. ఆ మహా నాయకునికి జయంతి నివాళులు.