Maharashtra: యాపిల్‌వాచ్ మరో ప్రాణం కాపాడింది. 150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి, ఊపిరి ఆగకుండా చూసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన 17ఏళ్ల స్మిత్ మేథా తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు. జోరువర్షంలో విసాపూర్ కోటపైకి ట్రెక్కింగ్ చేస్తుండగా కాలుజారి లోయలో పడిపోయాడు. కదిలే పరిస్థితి లేదు. ఆ సమయంలో అతడి వద్ద మొబైల్ కూడా లేదు.
వెంటనే ఆ బాలుడికి చేతికున్న యాపిల్ 7 సిరీస్ వాచ్ గుర్తొచ్చింది. దాని నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వారు లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. యాపిల్ వాచ్ వల్లే బతికి బట్టకట్టానని మేథా పేర్కొన్నాడు. ఈ విషయం పై కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు మేథా మెయిల్ చేశాడు. త్వరగా కోలుకోవాలని కుక్ బదులిచ్చాడు.