Site icon Prime9

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. బస్తర్‌ ప్రాంతంలో ఇవాళ భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. వరంగల్‌ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

 

 

దంతెవాడ, బీజాపుర్‌ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా నక్సలైట్‌ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

 

 

మృతురాలిని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రేణుక అలియాస్‌, ఛైతి అలియాస్‌ సరస్వతిగా గుర్తించారు. మావోయిస్టు స్పెషల్‌ జోనల్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రెస్‌ టీమ్‌ ఇన్‌‌చార్జిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె తలపై రూ.25లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 135 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది హతమార్చారు. 119 మంది ఒక్క బస్తర్‌ డివిజన్‌లోనే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. గత శనివారం సుక్మా, బీజాపుర్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో 11 మంది మహిళలే కావడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar