Site icon Prime9

Indian fisherman : పాకిస్థాన్ జైలులో భారత మత్స్యకారుడు ఆత్మహత్య

Indian fisherman

Indian fisherman

Indian fisherman : పొరుగు దేశం పాకిస్థాన్ కారాగారంలో మగ్గిపోతున్న ఇండియాకు చెందిన ఓ మత్స్యకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ విషయాన్ని వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

 

 

అవగాహన లేక అనేక మంది చిక్కుకున్నారు..
భారత్‌- పాక్ జల సరిహద్దులపై అవగాహన లేక చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్నారు. భారత్‌కు చెందిన మత్స్యకారుడు గౌరవ్‌రామ్‌ ఆనంద్‌ను (52), 2022లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి కరాచీ జైలులో ఉంచారు. నాటినుంచి ఇప్పటి వరకు అతడు అక్కడి కారాగారంలోనే మగ్గిపోతున్నాడు. మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన మత్స్యకారుడు తాడుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

 

అతడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో జైలు అధికారికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే జైలు అధికారి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే అతడు మ‌ృతిచెందాడు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచనున్నట్లు పాక్‌ అధికారులు తెలిపారు. గత నెలలో తమ కారాగారంలో ఉన్న 22 మంది మత్స్యకారులను పాకిస్థాన్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వారి శిక్షాకాలం పూర్తికావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి విడుదల చేసింది.

 

 

సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్లే అరెస్టులు..
మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్లే ఇరువైపులా అరెస్టులు జరుగుతున్నాయి. జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాక్‌లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది. తాజాగా ఓ మత్స్యకారుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version
Skip to toolbar