Union Home Minister Amit Shah : ముంబై పేలుళ్ల ఘటన కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణాను గురువారం మధ్యాహ్నం ఇండియాకు తీసుకురానున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అతడి అప్పగింత ఇండియాకు అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
హాని కలిగించే వ్యక్తులను వ్యక్తులను వదలం..
దేశ ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టదని స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు ఎవరి హయాంలో జరిగాయో వారు అతడిని వెనక్కి తీసుకురాలేకపోయారని విమర్శించారు. కానీ, తాము అతడిని తిరిగి ఇండియాకు తీసుకొస్తున్నామని చెప్పారు. తహవ్వుర్ రాక ఇండియాకు అతిపెద్ద దౌత్య విజయమని చెప్పుకొచ్చారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యాన్ని, న్యాయంపై నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఈ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా దాడులు చేసే వారిని మోదీ ప్రభుత్వం వెంటాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.
26/11 దాడిగా ప్రసిద్ధమైన ముంబయి ఉగ్రదాడికి రాణా సూత్రధారిగా వ్యవహరించాడు. అగ్రరాజ్యం అమెరికా తనను ఇండియాకు అప్పగించకుండా ఉండేందుకు అందుబాటులోని అన్ని న్యాయమార్గాలనూ రాణా ఉపయోగించుకున్నాడు. వాటన్నింటి నుంచి అతడికి నిరాశే ఎదురైంది. చివరగా భారత్‌కు అప్పగించవద్దంటూ అగ్రరాజ్యం అమెరికా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. దీంతో రాణాను ఇండియాకు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.
ఈ నేపథ్యంలోనే ఇండియాకు చెందిన అధికారుల బృందం అమెరికాకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన చర్యలు పూర్తి చేసింది. బుధవారం రాత్రి 7:10 గంటలకు ప్రత్యేక విమానంలో తహవ్వుర్‌ను తీసుకుని అధికారులు భారత్‌కు బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం ఇండియాకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకు వచ్చిత తర్వాత అతడిని ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసి, తిహార్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా జైలు చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. తహవ్వుర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. 2008లో నవంబరు 26న జరిగిన దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.