Air India: ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిన్ ఇండియా పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫైర్ అయింది. నిబంధలను గాలికి వదిలేశారని పైలట్ పై 3 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. విమానంలో ఓ పైలట్ తన స్నేహితురాలిని కాక్ పిట్ లోకి ఆహ్వానించిన ఘటనలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాన్ని తెలిపేందుకు ఆలస్యం జరిగిందంటూ ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్ తో పాటు సంస్థ భద్రత, రక్షణ నాణ్యత డిపార్ట్ మెంట్ హెడ్ కు కూడా ఇటీవల డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతకు ముందు ఈ ఘటనపై విచారణ ముగిసేంత వరకు.. సదరు విమానంలో ఉన్న సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని ఎయిర్ ఇండియాకు సూచించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చర్యలు తీసుకుంది.
ఫిబ్రవరి 27 వ తేదీ న దుబాయ్ నుంచి ఢిల్లీ కి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ పైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. అంతేకాకుండా ప్రయాణ సమయమంతా ఆమెను అక్కడే కూర్చో బెట్టుకున్నాడు. ప్రయాణికుల్లో తన స్నేహితురాలు ఉందని గుర్తించిన పైలట్.. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆమెను కాక్‌పిట్‌లోకి పిలిచాడు. ఢిల్లీ చేరే వరకు అంటే.. దాదాపు 3 గంటల పాటు ఆ మహిళ కాక్‌పిట్‌లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్‌లో కూర్చున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. తన స్నేహితురాలికి కాక్‌పిట్‌లోనే భోజనం అందజేయాలని, అన్ని మర్యాదలు చేయాలని విమాన సిబ్బందిని పైలట్ ఆదేశించినట్టు సమాచారం. ఇందుకు అభ్యంతరం తెలిపిన సిబ్బందితో పైలట్ దురుసుగా ప్రవర్తించారని ఆ ఫిర్యాదులో తెలిసింది.