Air India Express: సిక్ లీవ్ పెట్టిన 30 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

టాటా గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఇండియా విమానాలు మంగళవారం రాత్రి నుంచి సుమారు వంద విమానాల వరకు రద్దు అయ్యాయి. పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది సిక్‌ లీవ్‌ పెట్టడంతో ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు రద్దు చేయాల్సివచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిలబడి పోవాల్సి వచ్చింది.

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 02:00 PM IST

 Air India Express: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఇండియా విమానాలు మంగళవారం రాత్రి నుంచి సుమారు వంద విమానాల వరకు రద్దు అయ్యాయి. పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది సిక్‌ లీవ్‌ పెట్టడంతో ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు రద్దు చేయాల్సివచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిలబడి పోవాల్సి వచ్చింది. ప్రయాణికులు ఎయిర్‌ ఇండియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యవసరంగా ఇతర నగరాలకు వెళ్లాలనుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సుమారు 15వేల మంది ప్రయాణికుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో యాజమాన్యం సిక్‌ లిక్‌ పెట్టిన సుమారు 30 మంది సిబ్బందిని ఉద్యోగంలోంచి తొలగించింది. మిగిలిన ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చింది. కాగా గురువారం నాడు 20 ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ రూట్లలో 292 విమానాలను నడుపుతామని యాజమాన్యం ప్రకటించింది.

నాలుగు గంటల్లోగా విధులకు హాజరవ్వాలి.. ( Air India Express)

విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిని గురువారం సాయంత్రం 4 గంటలలోగా విధులకు హాజరు కావాలని హెచ్చరించింది. లేదంటే నాలుగు గంటల తర్వాత విధుల నుంచి తొలగిస్తామని ఈ మెయిల్‌ పంపించింది. అయితే సిబ్బంది కొరత కారణంగా గురువారం నాడు కూడా సుమారు 74 విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఎయిర్‌ఇండియాలో యాజమాన్యానికి ఉద్యోగుల మధ్య వివాదం ముదరడంతో ఢిల్లీలో ప్రాంతీయ లేబర్‌ కమిషనర్‌ అశోక్‌ పెరుమాల్లా గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమావేశం ఏర్పాటు చేశారు. మూకుమ్మడిగా సిక్‌ లీవ్‌ పెట్టడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని యాజమాన్యం వాదిస్తోంది.

ఉద్యోగుల మూకుమ్మడి సెలవుల కారణంగా పెద్ద ఎత్తున విమానసర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని .. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది. తొలగించిన ఉద్యోగులు ఇక ఏమాత్రం ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు కాదని, వారికి అధికార మెయిల్స్‌, సర్వర్లు, ఇతర కమ్యూనికేషన్స్‌ అందుబాటులో ఉండవని తెలిపింది. కంపెనీ నుంచి లభించే బెనిఫిట్స్‌ కూడా కోల్పోతారని ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. కాగా టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్‌ పోర్ట్‌ బయలుదేరే ముందు తమ వెబ్‌సైట్‌ ద్వారా ఆ రూట్‌లో సర్వీసులు నడుస్తున్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి సూచించారు.

ఒక వేళ విమాన సర్వీసు రద్దు అయినా.. లేక మూడు గంటలు లేదా అంత కంటే ఎక్కువ జాప్యం జరిగితే ప్రయాణికుడికి పూర్తి రీఫండ్‌ ఇవ్వడం జరుగుతుంది. లేదా తర్వాత తేదీల్లో రీషెడ్యూలు చేస్తే దాంట్లో టిక్కెట్‌ సర్దుబాటు చేస్తామని చెప్పింది. అలాగే కేబిన్‌ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందితో చర్చలు జరిపి వారి ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. అలాగే ప్రయాణికులకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార ప్రతినిధి చెప్పారు. కాగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈవో అలోక్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కేబిన్‌ సిబ్బంది మెరుపు సమ్మె, మూకుమ్మడి సెలవులతో ఈ నెల13 వరకు సర్వీసుల్లో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఎయిర్‌ ఇండియాలో నెలకొన్న సంక్షోభం గురించి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది.