AIADMK: అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
సమావేశంలో ఏఐఏడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో ఏఐఏడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా మాజీ నేతలు, మా ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామిపై అనవసర వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమ విధానాలను విమర్శించడంతో పాటు న్ దివంగత సిఎన్ అన్నాదురై మరియు దివంగత ముఖ్యమంత్రి జె జయలలితల పరువు తీస్తోందని ఎవరి పేరు ప్రస్తావించకుండా తీర్మానంలో పేర్కొంది.పొత్తు ముగింపు సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
అన్నామలై వ్యాఖ్యలే కారణమా ? (AIADMK)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం సిఎన్ అన్నాదురైపై తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదిరాయి..1956లో మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాదురై హిందూమతాన్ని అవమానించారంటూ బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.అన్నాదురై తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేసారు. అన్నామలై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. తన పార్టీకి మరియు అన్నాడీఎంకేకు మధ్య ఎటువంటి సమస్య లేదని అన్నారు. తాను అన్నాదురై గురించి చెడుగా మాట్లాడలేదని, 1956 నాటి సంఘటనను మాత్రమే చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే 2019 లోక్‌సభ ఎన్నికలు మరియు 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ భాగస్వామిగా ఉంది.