Udayanidhi Stalin’s Remarks: సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా 14 మంది మాజీ న్యాయమూర్తులతో సహా మొత్తం 262 మంది ప్రముఖులు మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగాన్ని గమనించాలని, సుమోటోగా తీసుకోవాలని వారుకోరారు. లేఖపై సంతకం చేసిన వారిలో 14 మంది మాజీ న్యాయమూర్తులు, 130 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు సహా 20 మందికి పైగా విదేశీ సేవల అధికారులు మరియు రాయబారులు మరియు 118 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు.
ఈ వ్యాఖ్యలు భారతదేశంలోని అధిక జనాభాకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగమని వారు తెలిపారు భారత్‌ను లౌకిక దేశంగా భావించే భారత రాజ్యాంగంలోని అంతర్భాగంపై దాడి చేస్తాయన్నారు.అంతేకాకుండా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉదయనిధి స్టాలిన్‌పై ఎటువంటి చర్య తీసుకోవడానికి నిరాకరించడంతో మరియు అతని వ్యాఖ్యలను సమర్థించడంతో చట్టబద్ధమైన పాలన మరింత బలహీనపడిందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. సనాతన ధర్మం’ సమానత్వం, సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించిన నేపథ్యంలో తీవ్ర కలకలం రేగింది. ‘సనాతన ధర్మాన్ని’ కరోనా, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పోల్చి, ఇలాంటి వాటిని వ్యతిరేకించవద్దని, నాశనం చేయాలని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
ఈ ప్రకటనపై తీవ్రంగా ప్రతిస్పందించిన అయోధ్య కు చెందిన పరమహంస ఆచార్య, ‘సనాతన్ ధర్మ’కు వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వ్యక్తికి రూ. 10 కోట్ల రివార్డు ప్రకటించారు. స్టాలిన్ తల నరికి తన తలను నా వద్దకు తీసుకువస్తే వారికి రూ.10 కోట్ల నగదు బహుమతి ఇస్తాను.. ఎవరైనా స్టాలిన్‌ను చంపే సాహసం చేయకపోతే నేనే అతడిని కనిపెట్టి చంపేస్తానని పరమహంస ఆచార్య అన్నారు.
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని పరమహంస ఆచార్య సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు నా తల నరకడానికి రూ 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు.నా తల దువ్వుకోవడానికి 10 రూపాయల దువ్వెన సరిపోతుందని తేలికగా చెప్పాడు. తమిళంలో చాప్ లేదా స్లైస్ అనే పదానికి జుట్టు దువ్వడం అని కూడా అర్థం.ఇది మాకు కొత్త కాదు.. ఈ బెదిరింపులన్నింటికీ భయపడే వాళ్లం కాదు.. తమిళం కోసం రైల్‌ట్రాక్‌పై తల పెట్టిన నేత మనవడిని నేను అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.