12 Maoists Killed, 2 Security Personnel Dead In Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా సమీపంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తుపాకుల కాల్పుల మోతలతో ఛత్తీస్‌గఢ్ అడవులు దద్దరిల్లాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
మావోయిస్టుల కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు చేపడుతున్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులతో పాటు ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈస్ట్ బస్తర్ సమీపంలో శుక్రవారం మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇంద్రావతీ నేషనల్ పార్క్ సమీపంలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఆపరేషన్ సెర్చ్ చేపట్టాయి. ఈ యాంటీ మావోయిస్టు ఆపరేషన్ కొనసాగిస్తుండగా.. కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో భద్రతా దళాలు ప్రతిస్పందించడంతో భీకరంగా కాల్పుల మోత వినిపించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా జరుగుతున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు జవాన్లలో ఒకరు రాష్ట్ర పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్‌కు చెందినవారు కాగా.. మరొకరు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన అధికారి అని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన భద్రతా సిబ్బంది మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన భీకర ఎదురుకాల్పుల్లోనూ పదుల సంఖ్యల్లో మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మావోయిస్టులను 2026 వరకు అంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్ షా గత నెల 6వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు ఆపరేషన్లు మరింత వేగవంతమైనట్లు తెలుస్తోంది.