Kamal Nath: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ హామీ ఇచ్చారు.ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ తరపున పలు హామీలు..(Kamal Nath)
నేను దీన్ని మొదటిసారిగా ప్రకటిస్తున్నాను. 100 రూపాయలు కాదు, 100 నిమిషాలు కాదు, 100 యూనిట్ల ఉచిత విద్యుత్.. మీకు ఇది కావాలా? అంటూ ధార్ జిల్లా బద్నావర్ ప్రాంతంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో నాథ్ ప్రశ్నించారు. నారీ సమ్మాన్ యోజన నుండి 27 లక్షల మంది రైతులకు రుణమాఫీ వరకు, కాంగ్రెస్ తరపున కమల్ నాథ్ ఇప్పటికే ఎన్నికల వాగ్దానాల జాబితాను రూపొందించారు. వాటిలో పాత పెన్షన్ స్కీమ్ (OPS)కి తిరిగి పునరుద్దరించడం, మధ్యప్రదేశ్‌లోని రాముడు అయోధ్య నుండి వనవాస సమయంలో బస చేసినట్లు విశ్వసించే ప్రాంతాలను అభివృద్ది చేయడం తదితర అంశాలు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత ఉంది..
2018 ఎన్నికల తర్వాత ఏర్పడిన కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంపై కోపంతో పాటు చౌహాన్ ప్రభుత్వంపై ఉన్న అధికార వ్యతిరేకత కారణంగా ఇప్పటికే తమకు అనుకూలత ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం మళ్లీ అధికారంలోకి రావడానికి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకుంది. స్థానిక సమస్యలపై బీజేపీపై నిరంతరం పోరాటం చేయడం ద్వారా తాము ప్రజలకు చేరువ అవుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పునరాగమనంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లోని 230 నియోజకవర్గాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. 2018లో, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 109 సీట్లు సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాదీ పార్టీ వరుసగా 4, 2, 1 స్థానాల్లో విజయం సాధించాయి.