Amit Shah: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను కేసీఆర్ నీరుగార్చారని అమిత్ షా ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత ప్రాణత్యాగం చేసిందని అంతేకాని రజకార్లతో కూర్చోవడానికి ప్రాణాలు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందని అమిత్ షా అన్నారు.కేసీఆర్ కారు భద్రాచలం వస్తుంది కానీ..రాములవారి వద్దకు వెళ్లదు. భద్రాద్రి రాములవారి దగ్గరకు వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్ 4జీ పార్టీ అంటే నాలుగు జనరేషన్ల పార్టీ.ఎంఐఎం 3జీ పార్టీ అంటే మూడు జనరేషన్ల పార్టీ.బీఆర్ఎస్ 2జీ పార్టీ అంటే రెండు జనరేషన్ల పార్టీ అని అమిత్‌షా ఎద్దేవా చేసారు. 2జీ, 3జీ, 4జీ కాదు తెలంగాణలో వచ్చేది బీజేపీ అని అమిత్ షా స్పష్టం చేసారు. కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. ఒవైసీ, కేసీఆర్‌తో కలిసి బీజేపీ పోటీ చేయదని అమిత్ షా చెప్పారు. ఒవైసీ వేదికను బీజేపీ పంచుకోదని అన్నారు. ఎదుగుతున్నారనే ఈటలను విధానసభ నుంచి బయటకు పంపారని అమిత్ షా అన్నారు. రైతులకు కాంగ్రెస్ రూ.22 వేల కోట్ల బడ్జెట్ పెడితే మోదీ ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిందని అమిత్ షా చెప్పారు. మోదీని మరోసారి ప్రధానిగా చేయాలన్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతుగోస-బీజేపీ భరోసా‘ సభ నిర్వహించామన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసమైందన్నారు. రైతులను మోసం చేయడానికే రైతు రుణమాఫీ పెట్టారని అన్నారు. తెలంగాణలో కౌలు రైతుల బలవన్మరణాలు పెరిగాయని అన్నారు. తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ ఖమ్మంకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం అని అన్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.