YS Viveka second wife: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వార్త ఏమన్నాఉందంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు. ఈ కేసు దర్యాప్తును ఈ నెల 30లోగా ముగించాలంటూ స్వయంగా సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి నిందితులని స్వయంగా వివేకా కుమార్తె సునీత చెబుతున్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో వైఎస్ వివేకానందర రెడ్డి రెండో భార్య షమీమ్ తెరపైకి వచ్చారు. ఆమె సీబీఐకు ఇచ్చిందంటూ వచ్చిన స్టేట్ మెంట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
రెండు సార్లు పెళ్లి..(YS Viveka second wife)
వివేకాతో తనకు 2010లో పెళ్లి జరిగిందని షేక్ షమీమ్ తెలిపారు. 2011లో మరోసారి పెళ్లి చేసుకున్నామని, 2015లో కుమారుడు షహెన్ షా పుట్టాడని ఆమె పేర్కొన్నారు. వివేకా హత్యకి కొన్ని గంటలముందు తనతో మాట్లాడారని ఆమె వెల్లడించారు. తమ పెళ్ళి వివేకా కుటుంబ సభ్యులకి ఇష్టం లేదని షేక్ షమీమ్ చెప్పారు. పలుమార్లు వివేకా అనుచరుడు శివప్రకాష్ రెడ్డి తనని బెదిరించాడని, తన కుటుంబ సభ్యులని కూడా బెదిరించాడని షేక్ షమీమ్ వివరించారు. వివేకాకి దూరంగా ఉండమని పలుమార్లు వైఎస్ సునీత కూడా బెదిరించారని షమీమ్ తెలిపారు.
సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారు..
వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కి, వివేకా పదవిపై శివప్రకాష్ రెడ్డికి కోరిక ఉండేదని షమీమ్ పేర్కొన్నారు. కుమారుడు షహెన్ షా పేరుతో 4 ఎకరాలు కొందామని వివేకా అనుకున్నా శివప్రకాష్ రెడ్డి అడ్డుకున్నాడని షమీమ్ చెబుుతున్నారు. వివేకాని సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టి, అన్యాయంగా చెక్ పవర్ తొలగించారని షమీమ్ వివరించారు. ఆర్ధిక ఇబ్బందులతో వివేకా ఇబ్బందులు పడ్డారని, బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనకి చెప్పారని షమీమ్ వెల్లడించారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్ల రూపాయల గురించి వివేకా మాట్లాడారని షమీమ్ తెలిపారు. వివేకా చనిపోయిన తరువాత ాయన ఇంటికి వెళదామనుకున్నా శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో వెళ్ళలేదని షమీం చెప్పారు.
మరోవైపు వైఎస్ వివేకా కూతురు సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందని అవినాశ్ తరఫు న్యాయవాది చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే..సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అరెస్టు చేయవద్దంటూ కొంత రిలీఫ్ ఇచ్చింది.
తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వారం రోజుల క్రితం అవినాశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో వైయస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. 25న హైకోర్టు తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో… వెంటనే ఈ పిటిషన్ పై విచారణ జరపాలని సునీత తరపు లాయర్ సుప్రీంకోర్టును కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది.