Andhra Pradesh: ప్రతీ మూడు నెలలకోసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్.. అందులో భాగంగా శుక్రవారం మరోసారి సమీక్ష నిర్వహించి ప 32 మంది ఎమ్మెల్యేలను హెచ్చరించారు.పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనని వార్నింగ్ ఇచ్చారు. ఇందులో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ఈ వంద రోజులు పార్టీకి చాలా కీలకమని, పనిచేయకపోతే కొత్త అభ్యర్ధులను బరిలోకి దింపుతానని నిక్కచ్చిగా చెప్పేశారు. ఎవరినీ మార్చే ఉద్దేశం తనకు లేదని, కానీ మీరే ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారని నిర్మొహమాటంగా తెలియజేశారు. ఓ వైపు నిఘా వర్గాలు, మరోవైపు ఐప్యాక్ రిషి నుంచి తనకు నివేదికలు వస్తాయని, నిర్లక్ష్యంగా ఉండేవారిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. వచ్చే మార్చిలో జరిగే తదుపరి సమీక్ష సమావేశం నాటికి పరిస్థితిలో మార్పు కనపడాలని సూచించారు.
పది రోజుల లోపుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు 32 మంది ఉన్నారని నివేదిక తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఎం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజా ప్రతినిధులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ఒక సచివాలయం పరిధిలో ఆరు నుండి ఎనిమిది గంటల పాటు పర్యటించాలని సీఎం సూచించారు. కానీ కొందరు ప్రజా ప్రతినిధులు గంట నుండి రెండు గంటల లోపే ఆయా సచివాలయాల పరిధిలో పర్యటించారు. ఇలా 30 రోజులను పూర్తి చేసిన వారి జాబితాను కూడా సమావేశంలో బయట పెట్టారు. ఇలా గంట పాటు పర్యటనలు చేసిన ప్రజా ప్రతినిధుల సంఖ్య 20గా ఉందని ఈ నివేదిక తేల్చింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం నెల రోజుల పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని గత సమావేశంలోనే సీఎం జగన్ చెప్పారు. కానీ ఈ విషయాన్ని కొందరు ప్రజా ప్రతినిధులు అంత సీరియస్ గా తీసుకోలేదు.
ఎన్ని ప్రతి సచివాలయానికి రూ. 20 లక్షలను మంజూరు చేసినా ప్రాధాన్యత క్రమంలో ఆయా సచివాలయాల్లో పనులను గుర్తించలేదని సీఎం వివరించారు. ప్రతి సచివాలయంలో ముగ్గురు కన్వీనర్లను ఈ నెల 25 లోపుగా నియమించాలని సీఎం ప్రజా ప్రతినిధులను కోరారు. వచ్చే ఏడాది జనవరి 25 లోపుగా గృహ సారధులను నియమించాలని సీఎం పార్టీ ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.