Tummala VS Puvvada: ఖమ్మం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా తలపడుతున్న మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశాన్నీ ఇద్దరూ వదులుకోవడం లేదు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
పువ్వాడ అఫిడవిట్ ప్రమాణాలకు లోబడిలేదు..(Tummala VS Puvvada)
పువ్వాడ దాఖలు చేసిన అఫిడవిట్ నిర్దేశిత ప్రమాణాలకి లోబడి లేదని తుమ్మల ఆరోపించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్‌లో కాకుండా బీఅర్ఎస్ అభ్యర్థి పువ్వాడ మార్చి ఇచ్చారని దీనిపై రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తుమ్మల మీడియాకి చెప్పారు. అయితే రిటర్నింగ్ అధికారి తీరు సరిగ్గా లేదని, ఎన్నికల సంఘానికి, న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తామని తుమ్మల హెచ్చరించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావుకు అధర్మం అలవాటని అన్నారు. తన నామినేషన్‌ని తిరస్కరించాలని తుమ్మల ఫిర్యాదు చేశారని పువ్వాడ చెప్పారు. తుమ్మల ఫిర్యాదుకి ఎన్నికల అధికారులు జవాబు కూడా ఇచ్చారని పువ్వాడ అజయ్ తెలిపారు. అఫిడవిట్‌లో తప్పులుంటేనే ఈసీ నోటీసులిస్తుందని, తనకి ఎలాంటి నోటీసులివ్వలేదని పువ్వాడ అజయ్ చెప్పారు.
మరోవైపు కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 10 లోపు 36మంది నామినేషన్ పత్రాలని సమర్పించారు. వీరిలో 35మందిపై ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకటరావు రిటర్నింగ్ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో పత్రాలని పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు ఇద్దరు ఇండిపెండెంట్ల నామినేషన్లని తిరస్కరించారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై గతంలో జలగం వెంకటరావు అనర్హత కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కిందికోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. తాజాగా జలగం వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదుతో మళ్ళీ కేసు తెరపైకి వచ్చింది. 24గంటలలోపు జలగం వేసిన కోర్టు ఆర్డర్ కాపీని తీసుకు రావాలని రిటర్నింగ్ అధికారి బిఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుని ఆదేశించారు.