Tulabharam with tomatoes: రోజురోజుకు టమోటా ధరలు పెరిగిపోతుండడంతో విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. టమోటా దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు అనకాపల్లి లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 51 కిలోల టమోటాలతో తన కుమార్తెను తూకం వేసాడు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ గుడిలో జరిగిన ఈ ఘటనను చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఆదివారం నూకాలమ్మ గుడిలో ఎవరో టమోటాలతో తులాభారం ఇచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు తులాభారం నిర్వహించారు. ఆలయ ఆవరణలో జరిగిన తులాభారంలో టమోటాలతో తులాభారం చేశారు. దీనిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా ఈ తులాభారం 51 కిలోల టమాటాతో, తర్వాత పంచదార, బెల్లంతో నిర్వహించారు..మార్కెట్‌లో టమాట ధర 150 పైనే పలుకుతుండగా దీన్ని చూసిన భక్తులంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
మరోవైపు టమోటాల దొంగతనాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుండి గ్రామ సమీపంలోని రైతు ఉదయ్‌కుమార్ పొలంలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడ్డారు.ఈ పంట మూడో కోత శనివారం జరగాల్సి ఉంది. కాగా, శుక్రవారం రాత్రి అరెకరంలో దొంగలు చేతివాటం చూపించారు. సుమారు 450 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. వాటి విలువ రూ.50 వేలకు పైగా ఉంటుందని ఉదయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.