Site icon Prime9

Revanth Reddy : డీలిమిటేషన్‌కు అంగీకరించం : అసెంబ్లీలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు స్పీకర్ గడ్డప్రసాద్ కుమార్ అనుమతితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం సభలో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పునర్విభజనతో జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కోరారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.

 

 

 

వ్యతిరేకించిన వాజ్‌పేయ్..
1971లో రాజ్యాంగ సవరణతో డీలిమిటేసన్ ప్రక్రియను 25 ఏళ్లుగా నిలిపేశారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పునర్విభజనపై నేటికీ అదే గందరగోళం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేశారని, జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానం చేశామని చెప్పారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను వాజ్‌పేయ్ కూడా వ్యతిరేకించారని గుర్తుచేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండానే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతోందని మండిపడ్డారు. పునర్విభజనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారని, కానీ జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్రాలు జనాభాను నియంత్రించలేదని ఆరోపించారు.

 

 

 

అన్ని పార్టీలు ఒకే మాటపై ఉండాలి..
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్ముకశ్మీర్‌, అసోంలో అసెంబ్లీ నియోజవర్గాలను పెంచారని ఆరోపించారు. కానీ, ఏపీ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని స్పష్టం పేర్కొన్నా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. సౌత్ రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో అన్ని పార్టీలు ఓకే మాటపై ఉండాలని కోరారు. ప్రభుత్వం పెట్టే తీర్మానానికి పార్టీలకు అతీతంగా తమ మద్దతును ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు.

Exit mobile version
Skip to toolbar