Weather Report: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాల పల్లి జిల్లా , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉత్తర దక్షిణ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిందని చెప్పింది. దీంతో గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగందో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా, ఆదివారం హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్న వరకు దంచి కొట్టిన ఎండతో నగరవాసులు అల్లాడిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ఉపశమనం లభించింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, ఖైరతాబాద్, అబిడ్స్ కోఠి, దిల్ సుఖ్ నగర్ లో వర్షం పడింది.
మరో వైపు తెలంగాణలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. సూర్యాపేట జిల్లా లక్కవరంలో అత్యధికంగా 46.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా జూన్ తొలి వారంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్టు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను తీసుకుంటే.. అత్యధిక ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీలు, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీలుగా నమోదైంది.