Site icon Prime9

Bandi Sanjay : రేషన్ బియ్యం వద్దని మోదీకి లేఖ రాసే దమ్ము రేవంత్‌కు ఉందా? : బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నం బియ్యం తామే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన గావ్ చలో కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం ఉదయం కరీంనగర్ మండలంలోని జూబ్లినగర్‌లో పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు.

 

మోదీ ప్రభుత్వం కిలోకు రూ.37లు ఖర్చు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు పంపిణీ చేసే బియ్యం కిలోకు రూ.10 మాత్రమే ఖర్చు చేస్తున్నారని, మోదీ ప్రభుత్వం కిలోకు రూ.37లు ఖర్చు చేస్తోందన్నారు. దీనిపై చర్చించే దమ్ము రేవంత్‌రెడ్డి ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇస్తున్న డబ్బులతో ఇంతకాలం మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఖర్చంతా తమదేనని చెప్పడం సిగ్గుచేటన్నారు.

 

రేవంత్‌కు బండి సవాల్..
కాంగ్రెస్ చెబుతున్నది నిజం అయితే రేషన్ బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు తమకు అవసరం లేదని, తామే కిలోకు రూ.50లు ఖర్చు పెట్టి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రేషన్ షాపులవద్ద ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్రం పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి దూరం చేశామన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. 12 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు.

 

కేసీఆర్‌ను మించిపోయారు..
పాలనలో రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పాలనను మించిపోతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీల ఊసే లేదని ఫైర్ అయ్యారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మండిపడ్డారు.

 

 

Exit mobile version
Skip to toolbar