Site icon Prime9

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్.. నివేదిక కోరిన గవర్నర్

TSPSC paper leak

TSPSC paper leak

TSPSC Paper Leak: ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలని గవర్నర్ తమిళి సై ప్రభుత్వాన్ని ఆదేశించారు.

గవర్నర్‌ సీరియస్.. (TSPSC Paper Leak)

టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఏఈ పేపర్‌ లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అభ్యర్థుల నుంచే కాకుండా.. రాజకీయపరమైన విమర్శలూ తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులు అరెస్ట్‌ కాగా, దర్యాప్తు సీసీఎస్‌ సిట్‌కు బదిలీ అయ్యింది. అయితే ఆ వెనువెంటనే ఈ కేసు దర్యాప్తు కోసం సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ రంగంలోకి దిగారు. ఇక ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళి సై స్పందించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ ద్వారా లేఖ పంపించారు. సమగ్ర విచారణ చేపట్టి.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరారు. అసలైన అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.

షెడ్యూలు ప్రకారమే గ్రూప్‌-1 మెయిన్స్‌

రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.

అనుమానాలకు తావులేకుండా ఇకనుంచి కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని వివరించారు. వచ్చె నేల 4 నుంచి జరిగే అన్ని పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపారు.

ఇక ఏఈ పరీక్షపై బుధవారం కీలక నిర్ణయం తీసుకొనున్నారు. టీఎస్‌పీఎస్సీలో నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారన్నారు.

ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు ఎక్కువ మార్కులు వచ్చినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు. అతడు ప్రధాన పరీక్షకు అర్హత సాధించలేదని తెలిపారు.

త్వరలో మరో 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు

మరో 3 వేలకు పైగా పోస్టులకు రెండు, మూడు నెలల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యోగులకు సైబర్‌ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాం. కమిషన్‌ కార్యాలయంలో సైబర్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నాం అని జనార్దన్‌రెడ్డి వివరించారు.

వదంతులు నమ్మెుద్దు..

ఈ వివాదంపై టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్పందించారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌.. అవకతవకలు జరిగే అవకాశమే లేదని అన్నారు.

అభ్యర్ధులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. ఆ వదంతులను ఆపేందుకే.. మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ నేపథ్యంలో మిగతా పేపర్లూ లీక్‌ అయ్యాయంటూ సభ్యుల ఆందోళన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు.

సుమారు 4 గంటల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. అదే విధంగా సీఎస్‌ శాంతకుమారితోనూ సమావేశమయ్యారు.

టీఎస్‌పీఎస్‌సీ పరిధిలోని 30 లక్షల మంది వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగే అవకాశం లేదన్న చైర్మన్‌.. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వచ్చిందని అన్నారు.

పేపర్‌లు లీక్‌ అయ్యాయంటూ, ఎగ్జామ్‌లు రద్దు అవుతాయంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టాలని తాము ఇదంతా చెప్తున్నామని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. దీంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు.

మరోవైపు గ్రూప్-1 పేపర్ లీక్.. గురుకుల ప్రిన్సిపల్ పరీక్లల్లోనూ అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో పురోగతి చోటు చేసుకుంది.

ఈ కేసు దర్యాప్తును సీసీఎస్‌ కు బదిలీ చేశారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. సీసీఎస్‌ తరపున సిట్‌ ఇకపై ఈ కేసు దర్యాప్తును కొనసాగించనుంది. సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు.

Exit mobile version