TSPSC Paper Leak: తెలంగాణలో పరీక్షా ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
శనివారం ఉదయం ప్రగతిభవన్‌కు వెళ్లిన జనార్థన్ రెడ్డి.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,
ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం.
టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు?(TSPSC Paper Leak)
మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
అయితే బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి సమావేశం అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్షను బోర్డు రద్దు చేసింది.
లీకేజీ వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ బోర్డు.
గ్రూప్1 తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ను తిరిగి జూన్ 11 న నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది.
ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేశారు. తాజా నిర్ణయంతో మొత్తం 6 పరీక్షలను రద్దు చేసినట్టైంది.
సిట్ నివేదిక ఆధారంగా..(TSPSC Paper Leak)
పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ నివేదిక ఆధారంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది.
ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను జనవరి 13వ విడుదల చేశారు.
503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది.
ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది