TRS MLAs: సమస్యల కంటే లంచ్ కే ప్రాధాన్యత

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమస్యల కంటే భోజనానికే ప్రాధాన్యత ఇచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చోటుచేసుకొనింది.

Sangareddy: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమస్యల కంటే భోజనానికే ప్రాధాన్యత ఇచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చోటుచేసుకొనింది. వివరాల మేరకు, నేడు జరిగిన సర్వ సభ్య సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. సంగారెడ్డి సమస్యలు చెప్పే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచ్ అంటూ వెళ్లేందుకు సిద్దమైనారు. దీంతో జగ్గారెడ్డి అభ్యంతరం చెప్పారు. ప్రోటోకాల్ నేపధ్యంలో నేను సభకు వచ్చానని, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నా ప్రాంత సమస్యలను మీరు వినాలంటూ వారికి సూచించారు. ఇందుకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడుదామంటే తాను సిద్దంగా ఉన్నానని, సమస్యలు చెప్పుకోవచ్చంటూ జగ్గారెడ్డి మాట్లాడుతుండగానే అధికార పార్టీ శాసనసభ్యులు సభ నుండి బయటకు వెళ్లిపోయారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తప్పితే ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదన్న ఆలోచనలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుందని చెప్పవచ్చు. అనేక సందర్భాలలో సాయంత్రం వరకూ కూడ సభలో ఉన్న శాసనసభ్యులకు జగ్గారెడ్డి మాట్లాడుతున్న సమయంలో భోజనం గుర్తుకు రావడం వంటి సంఘటనలు వారి ఆలోచన సరళికి అద్దం పడుతున్నాయి.