Mulugu: మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం ఎదురయింది. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు. దళితబంధు స్కీంలో తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి కారు ముందు నిరసన చేపట్టారు. మంత్రి కాళ్లు పట్టుకొని దళితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజాప్రతినిధులందరూ ఎమ్మెల్యే సీతక్కకు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు.
జిల్లాకు సత్యవతి ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ములుగు గడ్డ పై మంత్రి అడుగు పెట్టొద్దంటూ నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా మంత్రిని అడ్డుకుని రోడ్డు పైనే బైటాయించారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్లు పట్టుకుని దళితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో మంత్రి సత్యవతి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ కార్యకర్తల బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ వారికి హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు శాంతించారు.
పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి కార్యకర్తలకు నచ్చ చెప్పి అక్కడి నుండి పంపించారు. అయితే సొంత పార్టీ కార్యకర్తలే మంత్రిని న్యాయం చేయాలని కాళ్లు పట్టుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీలోని వారికే సరైన న్యాయం చేయకపోతే, ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.