Site icon Prime9

CM Revanth Reddy : ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా..? : కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ ఫైర్

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభపై సోమవారం సీఎం రేవంత్‌‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రసంగంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని సీఎం ఆరోపించారు.

 

బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు..
కేసీఆర్‌ ఖజానాను ఖాళీ చేసి తమపై నిందలు వేస్తారని అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. కేసీఆర్‌ ఇంకా అభద్రతాభావంతో మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదని మరోసారి విమర్శించారు. రాహుల్‌ గాంధీకి, తనకు గ్యాప్‌ ఉందనడం అవాస్తవమని స్పష్టం చేశారు. రాహుల్‌కు తనకు ఉన్న అనుబంధం ప్రపంచానికి చెప్పనవసరం లేదని చురకలు అంటించారు. అవసరాలను బట్టి కేసీఆర్‌, ప్రధాని మోదీ మాటలు మారుస్తున్నారని దుయ్యబట్టారు. దేశానికి ఇందిరా గాంధీ లాంటి ప్రధాని కావాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేలు వెళ్తేనే ప్రజల్లోకి పథకాలు వెళ్తాయని స్పష్టం చేశారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని ముఖ్యమంత్రి రేవంత్‌ హెచ్చరించారు.

 

కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి..
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి నివాసంలో ఆపరేషన్ కగార్ అంశంపై ముఖ్యమంత్రి జానారెడ్డితో చర్చిం‍చారు. ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి భేటీకి హాజరయ్యారు. మావోలతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. మావోల అంశంపై జానారెడ్డి, కేకే పార్టీలో చర్చిస్తారని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. కగార్‌పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.

 

ఆపరేషన్ కగార్‌తో మావోలు టార్గెట్..
తెలంగాణ, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్నిరోజులుగా మావోయిస్టులను కేంద్రం టార్గెట్‌ చేసింది. ఈ సందర్భంగా కర్రెగుట్టలో బాంబు వర్షం కురిపిస్తోంది. ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోయిస్టులు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్‌, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర చర్యలను తీవ్రంగా ఖండించారు. పౌర హక్కుల సంఘాలు కూడా తీవ్ర అభ్యతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ సమావేశంలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని సీఎం తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్రానికి ప్రతిపాదన చేస్తామని తెలిపారు. సామాజిక కోణంలో మావోల అంశాన్ని చూడాలన్నారు. మావోయిస్టుల భావాజాలాన్ని చంపాలనుకోవడం సరైంది కాదన్నారు.

Exit mobile version
Skip to toolbar