Site icon Prime9

Supreme Court : పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంలో విచారణ

Supreme Court

Supreme Court

Supreme Court : పార్టీ మారిన 10 ఎమ్మెల్యే అనర్హతపై ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్‌ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ధర్మాసనాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరిగింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తగిన చర్యలు తీసుకోలేదని సుప్రీంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వారం వాదనలు ముగిశాయి. తాజాగా స్పీకర్‌ తరఫున రోహత్గీ వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 

 

 

కోర్టు చెప్పడం భావ్యం కాదు..
స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాతే జ్యుడీషియల్‌ సమీక్షకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్పీకర్‌ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదన్నారు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్‌ నిర్ణయమే అన్నారు. రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని రోహత్గీ వాదించారు.

 

 

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వాదనలు..
జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా అని ప్రశ్నించారు. అనంతరం రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలో పిటిషన్‌ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్‌ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని, కనీసం ఆలోచించే అవకాశం లేకుండా పిటిషన్లు వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 

 

ముకుల్‌ రోహత్గీ వాదనల్లో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ జోక్యం చేసుకున్నారు. ధర్మాసనాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని చెప్పారు. నాలుగేళ్లు స్పీకర్‌ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్‌ వ్యవహరించలేరని రోహత్గీ అన్నారు. 2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, 2025 జనవరి 16న పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని, స్పీకర్‌ తన విధులు నిర్వర్తిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar