Site icon Prime9

Bhu Bharati act Launch: భూ భారతిని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. నాలుగు మండలాల్లో అమలు!

Bhu Bharati

Bhu Bharati

‘Bhu Bharati Act’ Launched by Telangana CM Revantha Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోర్టల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో పోర్టల్‌ను అమలు చేయనున్నారు. నారాయణపేటలోని మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములుగులోని వెంకటాపూర్‌, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్‌ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించి, తగిన మార్పులు చేయాలని సీఎం రేవంత్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయనున్నారు.

 

భూ భారతి చట్టం ప్రజలకు అంకితం: సీఎం రేవంత్
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో 69 లక్షల రైతన్నల కుటుంబాలకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోరాటాలు భూమి చుట్టూ తిరిగాయని గుర్తు చేశారు. జల్‌.. జంగిల్‌.. జమీన్‌ నినాదంతోనే కుమురం భీం పోరాడారని సీఎం పేర్కొన్నారు.

 

దొరలు, భూస్వాములకు అనుకూలంగా ధరణి: పొంగులేటి
గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రైతులకు ప్రయోజనకరంగా ఉండలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దొరలు, భూస్వాములకు అనుకూలంగా రూపొందించారని విమర్శించారు. భూ భారతి పోర్టల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు రైతులకు కంటి మీద నిద్రలేకుండా చేసే చట్టం చేసిందని ఆయన ఆరోపించారు.

 

ధరణి ఆరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు ఆమోదించని చట్టం కాబట్టే.. ధరణిని బంగాళఖాతంలో పడేశామన్నారు. కలెక్టర్‌ దగ్గర ఉన్న అధికారాలను వికేంద్రీకరణ చేశామన్నారు. వివిధ రాష్ట్రాల్లోని భూచట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ చట్టం రూపొందించామన్నారు. హరీశ్‌రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించినట్లు తెలిపారు. ముసాయిదాను మేధావులు, రైతుల ముందు పెట్టామని మంత్రి తెలిపారు.

 

భూ భారతి చట్టం ఓ మైలురాయి: భట్టి విక్రమార్క
ఏప్రిల్‌ 14 చరిత్రాత్మకమైన రోజని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నోచట్టాలు వచ్చాయని, తెలంగాణ చరిత్రలో భూభారతి చట్టం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ధరణి పోర్టల్‌ రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. రైతుల హక్కులను కాలరాసేలా ధరణి ఉందని ఎన్నిసార్లు చెప్పినా బీఆర్ఎస్ సర్కారు వినలేదని భట్టి అన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar